దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు విత్తనాల సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో వినోద్ కుమార్‌కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్‌డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ర్టాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా 400 సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు తెలిపారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వివిధ రకాల పంటలు చేతికి అందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి విత్తనాలు ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్లకు చేరాల్సి ఉండగా లాక్‌డౌన్ వల్ల జిల్లాల్లో క్షేత్రస్థాయి పోలీసులు సీడ్స్ రవాణాను అడ్డుకుంటున్నారని వినోద్‌కుమార్‌కు వారు విన్నవించారు.