ప‌్రమాదకర కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్ననేపథ్యంలో అమెరికాలో దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి వేదికైన బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్‌ను తాత్కాలిక దవాఖానగా మార్చబోతున్నారు. ఇందులో 350 పడకలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ అధికారి ప్రతినిధి క్రిస్ విద్‌మైర్ ఒక ప్రకటనలో తెలిపాడు. న్యూయార్క్‌లో పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. వైద్య అవసరాల కోసం ఈ స్టేడియం బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. న్యూయార్క్ నగరంలో బిల్లీ జీన్ కింగ్ స్టేడియం మాత్రమే కాదు పలు ప్రముఖ ప్రాంతాలను దవాఖానలుగా మార్చుతున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్య వైఖరితో కరోనా వైరస్‌తో ఇప్పటికే 3017 మంది చనిపోగా, లక్షా 63 వేల మందికి పాజిటివ్ అని తేలింది.